శ్రీ శంకర భాగావత్పాదాచార్యుల వారు మహా గ్రంథాలు రచించారు. వారు ప్రస్థానత్రయ భాష్యాలను రచించటమే కాకుండా, ఎన్నో ప్రకరణ గ్రంథాలను రచించారు. ప్రపంచసార, సౌందర్యలహరి వంటి మంత్ర శాస్త్ర గ్రంథాలను, అనేక భక్తి ప్రధాన స్తోత్రాలను రచించారు.

          మందాధికారులకు   సులభంగా అద్వైత సిద్ధాంతం బోధ పడటానికై వేయి శ్లోకాలలో, అయిదు వందల శ్లోకాలలో, నూరు శ్లోకాలలో అద్వైత సిద్ధాంతాన్ని వివరించారు.

        ఒకే ఒక శ్లోకంలో కూడా అతి సులభంగా ప్రతీ వారికీ అవగాహన అయ్యేటట్లుగా పొందుపరిచారు.


         ఆ ఒక శ్లోకం వేదాంత సారమై అది ఒక్కటే ఒక మహా గ్రంథంగా సమకూర్చుకున్నది. ఆ ఏక శ్లోకి మహా గ్రంథానికి ఒక పూర్వ గాథ ఉన్నది.


        ఒక గ్రామం లో ఒక విద్వాంసుడు ఉండేవాడు. ఆయన ప్రారబ్ధ కర్మ వల్ల అనివార్యమైన చర్మరోగంతో బాధపడుతూ ఉండేవాడు. 
ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. ఈ జాడ్యం వలన అతనికి వైరాగ్య బుద్ధి ఏర్పడినది.


         ఒకనాడు శ్రీ శంకరుల భగవత్పాదుల వారు ఆ గ్రామానికి రావటం తటస్థించినది. ఆయన కంటే ముందుగా ఆయన ప్రతిభా విశేషాలు, మహాత్మ్యమూ ఆ ఊరు చేరుకున్నాయి. ఆ గ్రామంలోని జనమంతా శ్రీ శంకరులకు ఎదురుపోయి స్వాగతం నివేదించారు. ఆ జనం లో చర్మరోగం వల్ల బాధ పడుచున్న విద్వాంసుడూ ఉన్నాడు. అతనికి ఏదో మహా తేజస్సు కన్పించి నట్లైంది. అతడు శంకరుల పాదాల మీద వ్రాలిపోయాడు.


          శ్రీ శంకరులకు అతనిని చూడగానే దయ కలిగింది. అతనిని సముద్ధరింప వలెనని వాత్సల్యం కలిగింది. అతని మనస్సు వైరాగ్య సిద్ధమైనదని అతడు శాస్త్ర రహస్యము లెరిగిన విద్వాంసుడని శ్రీ శంకరులు గ్రహించారు. అతనికి శ్రీ శంకరులు బ్రుహదారణ్యకోపనిషత్తులో 4 వ అధ్యాయ మందున్న "జ్యోతిర్బ్రాహ్మణ మహా విద్య"ను ఉపదేశించారు. ఈ మహా విద్యనూ పూర్వము యాజ్ఞ వల్క్య మహర్షి జనక మహారాజునకు ఉపదేశించినాడు. శ్రీ శంకరులు ఆ విద్వాంసునకు "తత్ త్వం అసి" అని చెప్పారు. శ్రీ శంకరుల అనుగ్రహ కటాక్షము వలన ఆ విద్వాంసునకు ఆత్మ జ్ఞానం కలిగింది. ఆ విద్వాంసునకు శ్రీ శంకరులు చేసిన ఉపదేశం ప్రశ్నోత్తర రూపంగా ఉన్నది. చివరకు విద్వాంసుడు ఆత్మ జ్ఞానమును పొందినట్లు నిరూపణ. వారి ప్రశ్నోత్తరములను స్వల్పముగా మార్పులు చేస్తే ఒక చక్కని శ్లోక రూపాన్ని పొందినాయి. శ్రీ శంకరులే ఆ శ్లోకమునకు రూపు కట్టించారు.
          ఈ శ్లోకం సర్వ వేదాంత సారమై రూపు కట్టినది. యిది ఉత్తమ ప్రకరణ గ్రంథమైనది.
ఆ శ్లోకమిది.

కిం జ్యోతి స్తవ భానుమా నహని మే రాత్రౌ ప్రదీ పాదికమ్,
స్యాదేవం రవి దీప దర్శన విధౌ కిం జ్యోతి రాఖ్యా హిమే
చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే
కిం తత్రహమతో భవా పరమహం జ్యోతిస్తదస్మి ప్రభో.


ఈ శ్లోకం లోని ప్రశ్నోత్తరాలు వివరంగా చూపవచ్చును.

శ్రీ శంకరుల ప్రశ్న: నీవు దేని సహాయంతో పదార్థములను చూస్తున్నావు
అతని సమాధానం: పగటి పూట సూర్యుని వెలుతురు  వలన.

ప్రశ్న: రాత్రివేళ ?
సమాధానం: దీపం, చంద్ర కాంతి, నక్షత్ర కాంతి వలన.

ప్రశ్న: కన్నులు మూయ బడినప్పుడు లేక మూసుకోన్నప్పుడు దేనివలన నీవు గ్రహిస్తున్నావు.
సమాధానం: నా మనస్సు.

ప్రశ్న: మనస్సు వస్తు స్వరూపాన్ని గ్రహించడానికి తోడ్పడుతున్న దేమిటి?
సమాధానం: అది నేను.

ప్రశ్న: అయితే నీవు అత్యధికంగా కాంతి ప్రసారం చేస్తున్న వస్తువు అన్నమాట.
సమాధానం: అవును మహా ప్రభో నేను జ్యోతి స్వరూపాన్ని నేను గ్రహించాను.

ఈ పై శ్లోకం లోని ప్రశ్నోత్తరాలను   బాగా  అవగాహన చేసికోవాలంటే బృహదారణ్యకం లోని జ్యోతిర్బ్రాహ్మణమును పరిశీలించడం మంచిది.


to be cont ....